తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్: 10 మావోయిస్టుల మృతి
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్: 10 మావోయిస్టుల మృతి
తెలంగాణ సరిహద్దులో ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టల ప్రాంతంలో జరిగిన 'ఎన్‌కౌంటర్'లో 10 మంది 'మావోయిస్టులు', ఒక గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మరణించారని అధికారులు తెలిపారు.
"10 మంది మావోయిస్టుల శవాలను స్వాధీనం చేసుకున్నాం" అని తెలంగాణ పోలీసు విభాగానికి చెందిన ఒక అధికారి బీబీసీకి తెలిపారు.
ఈ ఘటనలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ సుశీల్ మృతి చెందారని కూడా ఆయన చెప్పారు.
ఈ కాల్పుల ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తడపాల్ అనే గ్రామ సమీపంలో జరిగినట్టు ఆ అధికారి చెప్పారు.
ఈ అటవీ ప్రాంతాన్ని కర్రెగుట్టలు అని వ్యవహరిస్తారు.
ఘటనా స్థలం నుంచి ఒక ఏకే-47, ఒక ఎస్ఎల్ఆర్, రెండు ఇన్సాస్ రైఫిళ్లు, నాలుగు 12 బోర్ తుపాకులు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు.
మృతులలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్టు కొన్ని స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. పోలీసు అధికారి మాత్రం శవాలను ఇంకా గుర్తించాల్సి ఉందని తెలిపారు.