పవన్ కళ్యాణ్ జనసేన పోరాట యాత్ర ప్లాన్‌గా సాగుతోంది
పవన్ కళ్యాణ్ జనసేన పోరాట యాత్ర ప్లాన్‌గా సాగుతోంది

పవన్ కళ్యాణ్ జనసేన పోరాట యాత్ర ప్లాన్‌గా సాగుతోంది. ఓ వైపు ఆయా ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, మరోవైపు పార్టీ అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటారని భావిస్తున్న వారిని జనసేనాని చేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో పలువురు నాయకులు చేరారు. మరికొందరు చేరే అవకాశముందని అంటున్నారు. తద్వారా పార్టీ బలోపేతంపై కూడా పవన్ దృష్టి సారించారని భావించవచ్చు. పవన్ పర్యటనలో ఆయనను పలువురు కలుస్తున్నారు.
విశాఖపట్నంలో కోన తాతారావు తొలుత జనసేనలో చేరారు. ఆ తర్వాత గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య చేరారు. ఆయన గాజువాక ప్రాంతంలో పట్టున్న నాయకులు. అదే రోజు మాజీ కాంగ్రెస్ నాయకుడు బాలసతీశ్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం సబ్బం హరి మేయరుగా పనిచేసిన సమయంలో ఈయన సిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారు.
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరి విశాఖ ఎంపీగా బరిలో దిగిన బొలిశెట్టి సత్యనారాయణ కూడా జనసేనలో చేరడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతోంది. పీసీసీ కార్యదర్శి గుంటూరు నర్సింహమూర్తి, ఆయన భార్య గుంటూరు భారతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వీరు అదే దారిలో ఉన్నారట.
ఇధిలా ఉండగా, విశాఖపట్నంలోని సీతమ్మధార టీపీటీ కాలనీలో జనసేన నూతన కార్యాలయం మంగళవారం ప్రారంభమైంది. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలతో దీనిని పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని పారదోలే వరకు పోరాటం చేస్తామన్నారు. అన్ని వనరులు ఉన్న ఉత్తరాంధ్ర వెనుకబడిపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణం అన్నారు. ఈ వెనుకబాటుతనానికి కారణాలు అన్వేషఇంచడంతో పాటు ఇక్కడి సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు సూచించి అభివృద్ధికి బాటలు వేసేందుకు మన కార్యాలయం వేదిక కావాలన్నారు.